చెన్నై నగరాన్ని తమిళనాడు సర్కార్ వేగంగా విస్తరింపజేస్తోంది. దీంతో ఒక అడుగు అలా వేస్తే ఏపీలోకి ఎంట్రీ అయ్యే పరిస్థితి. ఏపీకి దక్షిణ సరిహద్దుగా తమిళనాడు రాష్ట్రం ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలు తమిళనాడు సరిహద్దు జిల్లాలుగా ఉన్నాయి. తమిళనాడు సర్కారు చేపడుతున్న తాజాగా చర్యలు పూర్తయితే... ఏపీ సరిహద్దును దాటేస్తే మన అడుగు నేరుగా చెన్నైలో పడిపోతుంది. అంటే... చెన్నై మహా నగరాన్ని ఏపీ సరిహద్దు దాకా విస్తరించేందుకు తాజాగా తమిళనాడు సర్కారు తీర్మానించింది. ఈ విస్తరణ చర్యలు పూర్తయితే... ఏపీ సరిహద్దులను ముద్దాడుతూ చెన్నై కనిపిస్తుంది. ఈ విస్తరణలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,225 గ్రామాలు పూర్తిగా చెన్నైలో కలవనున్నాయి.
ప్రస్తుతం చెన్నై మెట్రోపాలిటన్ అథారిటీ (సీఎండీఏ) పరిధి 1,189 చదరపు కిలోమీటర్లుగా ఉంది. దీనిని ఏకంగా 5,904 చదరపు కిలోమీటర్లకు పెంచాలని తమిళనాడు సర్కారు తీర్మానించింది. హైదరాబాద్ మహా నగరం కన్నా మిన్నగా చెన్నైని విస్తరించాలన్న దిశగా తమిళనాడు సర్కారు 2018లోనే ఆలోచన చేసింది. హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు కాగా... దానిని మించి సీఎండీఏను 8,878 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించాలని తలచింది. అయితే ఆ తర్వాత ఈ ఆలోచనను ఆ రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టేసింది.
తాజాగా ఈ ప్రతిపాదనలకు బూజు దులిపిన డీఎంకే సర్కారు.. సీఎండీఏ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలి కాలంలో చెన్నైలోని మీనంబాక్కం విమానాశ్రయానికి విపరీతంగా రద్దీ పెరుగుతోంది. రానున్న 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో మరో భారీ విమానాశ్రయానికి తమిళనాడు ప్రణాళికలు రచిస్తోంది. కాంచీపురం జిల్లాలోని పరందూరులో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఇందుకోసం అక్కడి దాదాపు 13 గ్రామాల పరిధిలోని 4,563 ఎకరాలను సేకరించేందుకు యత్నిస్తోంది.
చెన్నై విస్తరణతో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎంతో మేలు జరగనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చెన్నై విస్తరణతో ఈ రెండు జిల్లాల ప్రజలకు ఉపాధి అవకాశాలతో పాటు ఇతరత్రా పారిశ్రామీకరణ ఫలాలు కూడా అందనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక తమిళనాడులోని తెలుగు ఓటర్లు అధికంగా కలిగిన పలు నియోజకవర్గాలు చెన్నైలో విలీనం కానున్నాయి. వీటిలో తిరువళ్లూరు, రాణిపేట, పొన్నేరి, ఉత్తుకోట, శ్రీపెరంబుదూరు నియోజకవర్గాలు ఉన్నాయి.