యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నవంబర్ 8వ తేదీ మంగళవారం రోజు సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకొని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. సోమవారం వివరాలు తెలుపుతూ నవంబర్ 8వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2: 37 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6: 19 నిమిషములకు సమాప్తం అవుతున్నందున చంద్రగ్రహణం కారణంగా ప్రధానాలయము, ఉపాలయంలో, అనుబంధాలయంలో మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం 8: 15 నిమిషాల లోపు నిత్య కైంకర్యములు, నివేదన ముగించుకొని దేవాలయాన్ని మూసివేసి అదే రోజు మంగళవారం రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమం తో పాటు నిత్య కైంకర్యములు నివేదన గావించి రాత్రి 10 గంటలకు స్వామివారి ఆలయం మూసి వేయబడుతుందని ఈవో వివరించారు. మరుసటి రోజు 9వ తేదీ బుధవారం యధావిధిగా నిత్య కైంకర్యంలో నిర్వహించబడతాయని ఈవో చెప్పారు. 8వ తేదీ ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరచి3గంటలనుండి 3: 30 వరకు సుప్రభాతం 3: 30 నుండి 4: 30 వరకు ఆరాధన మరియు బాల భోగం 4: 30 నుండి 5: 30 వరకు నిజాభిషేకం 5: 30 నుండి 6: 15 నిమిషాల వరకు సహస్రనామార్చన, 6: 15 నిమిషముల 7: 30 వరకు ఉభయ దర్శనములు, 7: 30 నుండి 8: 15 నిమిషాల వరకు మధ్యానిక ఆరాధన నివేదన, చాత్పర, ద్వారబంధన కార్యక్రమాలు ఉంటాయని రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ ప్రాయశ్చిత్త హోమం, నవ కలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన, చాత్పర కార్యక్రమాలు జరిపి రాత్రి 10 గంటలకు శయనోత్సవం ద్వారబంధనం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి కి నిర్వహించు అన్నకుటోత్సవం లాంచనంగా నిర్వహించబడుతుందని తెలిపారు. స్వామి వారి ఆలయం అనుబంధ దేవాలయంలో మరియు సత్యనారాయణ స్వామి వారి వ్రతములు వాహన పూజలు చంద్రగ్రహణం సందర్భంగా ఎనిమిదవ తేదీ మంగళవారం 8: 15 నిమిషముల లోపు మూసివేయబడుతుందన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా 8వ తేదీ భక్తులచే నిర్వహించబడే నిత్య కళ్యాణం, శాశ్వత కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవములు, ఊరేగింపు సేవలు రద్దు చేయబడతాయని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో చెప్పారు.