తుని రైలు దహనం కేసులో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మంగళవారం విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. 2016 జనవరి 31న కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తునిలో పద్మనాభం దాదాపు లక్ష మందితో ‘కాపు గర్జన మహాసభ’ నిర్వహించారు. అనంతరం సభలో ఆయన రోడ్డు, రైలురోకోలకు పిలుపునివ్వడంతో వెంటనే కాపు నాయకులు, అక్కడికి వచ్చిన యువకులు అందరూ ట్రాక్‌పై రైలురోకో నిర్వహించి రత్నాచల్ ఎక్స్‌ప్రె్‌సను నిలుపుదల చేసి ప్రయాణీకులను దించేసి రైలుకు నిప్పుపెట్టారు. ఈ ఘటనపై తుని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) పోలీసులు రైల్వే అమెండ్‌మెంట్ యాక్ట్ 2003 ప్రకారం సెక్షన్ 180ఎ, 146, 147, 153, 174 (ఎ), (సి) కింద క్రైం నెం. 77/2016గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముద్రగడ పద్మనాభంను ప్రథమ ముద్దాయిగా పేర్కొంటూ ఆర్‌పీఎఫ్ పోలీసులు మొత్తం 41 మందిపై కేసు నమోదు చేసి చార్జిషీటులో 24 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. విజయవాడ రైల్వే కోర్టులో కేసు విచారణ ప్రారంభం కావడంతో ఆర్‌పీఎఫ్ ఏపీపీ టి.మురళి మంగళవారం నాటికి ముగ్గురు సాక్షులను విచారించారు.