పులివెందుల నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని శైవక్షేత్రాలకు కార్తీకశోభ సంతరించుకుంది. ఈ దఫా ఎలాంటి కరోనా నిబంధనలు లేకపోవడంతో భక్తులు కూడా కార్తీకసోమవారాలల్లో శివుడికి నైవేద్యం, అభిషేకాలు చేయించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో పులివెందుల పట్టణంలోని మిట్టమల్లేశ్వరాలయం, సింహాద్రిపురం మండలం సమీపంలోని భానుకోట ఆలయాలు సోమవారం దీపకాంతులో దేదీప్యమానంగా ప్రకాశించాయి. కార్తీకమాసంలో దీపాలకు ప్రత్యేకత ఉంది. కార్తీకమాసం పూర్తయ్యే వరకు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత అటు గుళ్లు, గోపురాలు ఇటు ఇళ్ల ముంగిట దీపాలు. వెలిగించడం ఆనవాయితీ.
దీపాలు వెలిగించడం శాస్త్రీయంగా శుభపరిణామని తెలుస్తోంది. శరదృతువు రావడంతో మబ్బులు ఎక్కువగా ఉంటాయి. ఇదే సీజనులో గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటం వల్ల దోమలు, కీటకాలు వాటికి అనుకూలంగా మార్చుకుంటాయని పెద్దలు చెబుతున్నారు. ఒక్కో దీపం ఎన్నో జీవరాసులను నాశనం చేస్తుందనే ప్రచారం ఉంది. ఇలాంటి స్థితిలో దీపాలు వెలిగించడం కూడా ఆరోగ్యప్రదాయని భక్తులు చెబుతారు. కాగా సాంకేతిక పరిజ్ఞానం అరుదెంచినా ప్రాచీన కాలం. నుంచి నేటి నవీన యుగం వరకు దీపాలు వెలిగించేందుకు మట్టి ప్రమిదలనే ఉపయోగించడం సంప్రదాయ గొప్పతనానికి అద్దంపడుతోంది. మొత్తంమీద రెండో సోమవారం రోజున భక్తుల. కోలాహంతో శివాలయాలు దీపకాంతులతో ప్రకాశించాయి.