గూగుల్ తన పిక్సల్ 4 సిరీస్ ఫోన్లకు సాంకేతిక సహకారాన్ని నిలిపివేసింది. పిక్సల్ 4, పిక్సల్ 4ఎక్స్ఎల్ ఫోన్లకు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ ఆగిపోయాయి. మన దేశంలో ఈ ఫోన్లను కలిగిన వారు తక్కువే. ఎందుకంటే వీటిని మన మార్కెట్లో నేరుగా గూగుల్ విక్రయించలేదు. కాకపోతే గూగుల్ పిక్సల్ 4ఏ ఫోన్లను మన దేశంలో చాలా మంది కొనుగోలు చేశారు. వీరికి కూడా సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ సహకారం 2023లో నిలిచిపోనుంది.
పిక్సల్ ఫోన్లకు గూగుల్ ఇటీవల కొన్ని అప్ డేట్స్ ను ఇచ్చింది. కానీ, పిక్సల్ 4, 4 ఎక్స్ఎల్ కు అవి రాలేదు. దీంతో వాటికి సహకారం నిలిపివేసినట్టు తెలిసింది. చివరిగా ఆండ్రాయిడ్ 13 అప్ డేట్ అక్టోబర్ లో వాటికి లభించింది. పిక్సల్ 4ఏ ఫోన్లకు 2023 ఆగస్ట్ నుంచి అప్ డేట్స్ నిలిచిపోనున్నాయి. పిక్సల్ 4ఏ 5జీ వెర్షన్ ఫోన్లకు 2023 నవంబర్ వరకు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ వస్తాయని గూగుల్ సపోర్ట్ పేజీ పేర్కొంది. ఆండ్రాయిడ్ 14 వెర్షన్ ఓఎస్ 2023 ఆగస్ట్ లోపు విడుదల అయితే, దాని అప్ డేట్ చివరిగా పిక్సల్ 4ఏ ఫోన్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ భారత్ లో పిక్సల్ 7 ఫోన్లను విక్రయిస్తుండడం తెలిసిందే. మధ్యలో గూగుల్ 5, 6 వెర్షన్లను అసలు మన దేశంలోకి తీసుకురాలేదు.