ప్రధాని మోదీతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి విశాఖపట్నంలో అందుబాటులో ఉండాలని జనసేనానికి బీజేపీ నుంచి సమాచారం అందింది. నేవీ అతిథిగృహం ఐఎన్‌ఎస్ చోళాలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత పవన్‌ను విందు భేటీలో కలుస్తారని తెలిసింది. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే శనివారం ఉదయం అల్పాహారం సమయంలో కలుసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వైసీపీ అరాచక పాలనను జనసేనాని ఈ సందర్భంగా ప్రధానికి వివరిస్తారని సమాచారం. అలాగే రాష్ట్ర బీజేపీ నేతలతో వచ్చిన గ్యాప్.. పవన్‌ను సరిగా ఉపయోగించుకోవడం లేదంటూ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రధానిని కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో పవన్ హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకోనున్నారు. ఆదివారం వరకూ నగరంలోనే ఉంటారు. ఈ భేటీపై జనసేన స్పందించకపోవడం గమనార్హం. ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లపై ఆ పార్టీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ మూడు రోజుల్లో ఒక రోజు పవన్ విశాఖ లేదా విజయవాడలో టిడ్కో ఇళ్లను పరిశీలించనున్నారు.