తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభించనున్నారు. రాయలసీమ నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించనున్నట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. జనవరిలో సంక్రాంతి తర్వాత యాత్ర ప్రారంభించాలని ఆయన ఇంతకు ముందే నిర్ణయించుకొన్నారు. 24, 27 తేదీల్లో ఒక రోజును ఎంపిక చేసుకోవాలని పండితులు సూచించగా, రిపబ్లిక్ దినోత్సవం మర్నాడు 27 తేదీ శుక్రవారం నుంచి చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ఒక కొసన ఉన్న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమై ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంతో ముగియనుంది. కనీసం ఏడాదిపాటు ఇది కొనసాగుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. 2024 ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి కొద్దిగా ముందు ఫిబ్రవరి లేదా మార్చి నెల వరకూ పాదయాత్రను నడిపించాలన్న పట్టుదలతో లోకేశ్ ఉన్నారు. ఈ లెక్కన సుమారు 400 రోజులపాటు ఈ యాత్ర సాగుతుంది.