ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీపై జనసేన పార్టీ పోరాట దూకుడు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జగనన్న కాలనీల పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పోరాటానికి జనసేన సిద్దమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్మిస్తోన్న ఇళ్లకు సంబంధించి అవినీతి జరుగుతుందంటూ ఈ నెల 12,13,14వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు జనసేన శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నేతలు జగనన్న కాలనీలను సందర్శించి నిరసన కార్యక్రమాలు చేపడుతోన్నారు. జగనన్న కాలనీలకు సంబంధించి జరుగుతోన్న అక్రమాలపై ప్రశ్నిస్తోన్నారు.
మంగళగిరిలో టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి వెళ్లిన జనసేన శ్రేణులను స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్లను పరిశీలించేందుకు మంగళగిరిలోని జగనన్న నగర్‌కు జనసేన కార్యకర్తలు వెళ్లారు. ఈ సందర్భంగా వారిని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు అన్ని సదుపాయాలతో ఇళ్లు నిర్మించి ఇస్తోందని, మీరు రాజకీయం చేయవద్దంటూ జనసేన శ్రేణులను అడ్డుకున్నారు. రాజకీయం చేయడానికి మా ఇళ్లకి వచ్చారా? అంటూ మహిళలు ప్రశ్నించారు. వెంటనే జనసేన కార్యకర్తలు కాలనీ నుంచి వెళ్లిపోవాలని లబ్ధిదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
లబ్ధిదారులు, జనసేన కార్యకర్తల మధ్య వివాదంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి లబ్ధిదారులను శాంతింపజేసి జనసేన కార్యకర్తలను అక్కడ నుంచి పంపించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. జగనన్న ఇళ్లు- పేదలందరికీ కన్నీళ్లు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పేదలకు నిర్మిస్తోన్న ఇళ్లను పరిశీలించే కార్యక్రమాన్ని జనసేన నిర్వహిస్తోంది. ఇళ్లను పరిశీలించిన తర్వాత అక్కడ తీసిన ఫొటోలు, వీడియోలను #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేలా డిజిటల్ క్యాంపెయిన్‌ను జనసేన ప్రారంభించింది.
అందులో భాగంగా జనసేన నేతలు, కార్యకర్తలు వెళ్లి జగనన్న కాలనీలను పరిశీలిస్తోన్నారు. అక్కడ లబ్ధిదారులను అడిగి పనుల వివరాలను తెలుసుకుంటున్నారు. జగనన్న కాలనీల్లో పనులు ఎలా జరుగుతున్నాయనే దానిపై ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa