ఇటీవల ఏపీలో జరిగిన విద్యార్థుల మిస్సింగ్ కలకలంరేపిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ఈనెల 9న పారిపోయిన విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. ఆగ్రాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆగ్రా నుంచి ఒక విద్యార్థి.. డబ్బులు కావాలని స్నేహితుడికి ఫోన్ చేయడంతో ఆచూకీ విషయం తెలిసింది. దీంతో ఇక్కడినుంచి ఆగ్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు తిరుపతి వెస్ట్ పోలీసులు. ప్రస్తుతం ఆ ఐదుగురు విద్యార్థలు ఆగ్రా పోలీసుల అదుపులోనే ఉన్నారు. వారిని తీసుకురావడానికి ఎస్సై ఓబయ్య బృందం తిరుపతి నుంచి ఆగ్రాకు బయలుదేరింది.
తిరుపతిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు బుధవారం అదృశ్యమయ్యారు. వీరిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. ఇందులో నలుగురు 10వ తరగతి, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. స్కూళ్లో ఉదయం పరీక్షలు రాసేందుకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాలేదు. పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో.. వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర రెడ్డి, ఏఓ మదన్‌మోహన్ తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పరీక్షలు పూర్తయ్యాక పదో తరగతి విద్యార్థులు.. 9వ తరగతి బాలుడి ఇంటికి వెళ్లి, అతనితో మాట్లాడి బయటికి రప్పించారు. తర్వాత ఐయిగురు కలిసి మరో 9వ తరగతి విద్యార్థి ఇంటికి వెళ్లి తమతో రావాలని అడిగారు. ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే... తమతో వస్తేనే చెబుతామని స్పష్టం చేశారు. దీంతో అతను వెళ్లలేదు. తర్వాత ఆ ఐదుగురు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. దీంతో సీఐ శివప్రసాద్.. దీనిపై ఫోకస్ పెట్టారు. పిల్లల దగ్గరున్న సెల్‌ఫోన్ల ఆధారంగా వారిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని.. వారి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు. తిరుపతి పోలీసులు ఇక్కడ దర్యాప్తు చేస్తుండగానే.. ఆ ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. వారే ఇక్కడున్న ఒకరికి కాల్ చేయడంతో విషయం బయటపడింది. దీంతో వారిని తిరుపతికి తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు ఆగ్రాకు బయల్దేరారు.