తూర్పు గోదావరి జిల్లాలో సారా తయారు చేస్తున్న 261 మందిని ప్రభుత్వం గుర్తించిందని, వారికి అవగాహన కల్పించి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బ్యాంక్ మేనేజర్లు, జిల్లా మండల అధికారులతో కలెక్టర్ సోమవారం సమావేశం నిర్వహించారు. సారా తయారు చేస్తున్న వారిలో వారి ఉపాధి అవసరాలకు అనుగుణంగా వివిధ వ్యాపారాలకు 137మందిని ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే వారికి ముద్ర పథకం ద్వారా బ్యాంక్ రుణాలు ఇప్పించడానికి దరఖాస్తు చేయించామని చెప్పారు. గతంలో 29 మందికి రూ.కోటి కి పైగా రుణాలు ఇప్పించామన్నారు. త్వరలో యూనిట్స్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెలలో 150మందికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.డీఆర్‌డీఏ పీడీ సుభాషిణి, మెప్మా డీపీఎం కె.మోహనరావు పాల్గొన్నారు.