సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్దమైన చైనా అందుకోెసం తనవంతు ప్రయత్నాలను మమ్మురం చేస్తోంది. ఎలక్ట్రానిక్ విప్లవంతో ఎంతో వాణిజ్య ప్రగతి సాధించిన చైనా, గత కొంతకాలంగా అంతరిక్ష పరిశోధనలపై తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. అపారమైన అణుశక్తిని అందించే కృత్రిమ సూర్యుడ్ని రూపొందిస్తున్న చైనా, అసలు సూర్యుడి గుట్టుమట్లు తెలుసుకునేందుకు కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో టిబెట్ పీఠభూమిపై భారీ టెలిస్కోప్ వ్యవస్థను మోహరించింది. ఈ టెలిస్కోపిక్ డిష్ ల సమాహారానికి దావోచెంగ్ రేడియో టెలిస్కోప్ గా నామకరణం చేశారు. ఇటీవలే ఈ టెలిస్కోప్ వ్యవస్థ నిర్మాణం పూర్తయింది. రోదసి నుంచి వెలువడే అత్యంత బలహీన సంకేతాలను కూడా పసిగట్టే సామర్థ్యం ఈ టెలిస్కోప్ వ్యవస్థ సొంతం. ఈ టెలిస్కోప్ వ్యవస్థ ట్రయల్స్ ను వచ్చే ఏడాది జూన్ లో నిర్వహించనున్నారు.
రూ.113 కోట్ల వ్యయంతో చైనా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రధానంగా సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఈ రేడియో టెలిస్కోప్ ను వినియోగించనున్నారు. సూర్యుడి ప్రభావం రోదసిపైనా, భూ వాతావరణంపైనా ఎలా ఉంటుందన్నది తెలుసుకోనున్నారు. ఇక ఈ భారీ టెలిస్కోప్ లో భాగంగా 313 రేడియల్ డిష్ లను వినియోగించారు. 6 మీటర్ల నిడివితో ఉండే ఈ డిష్ ల సమాహారం 3.14 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది.