ట్విట్టర్ బ్లూటిక్ అంశంపై తాజాగా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఇదిలావుంటే ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ను అర్థాంతరంగా నిలిపివేయడంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ సేవను రద్దు చేయలేదని, త్వరలోనే తిరిగి తీసుకొస్తామని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఐవోఎస్ యూజర్లకు బ్లూ టిక్ ప్లాన్ ను నెలకు 8 డాలర్ల చార్జీతో ట్విట్టర్ ప్రారంభించడం తెలిసిందే. బ్లూ టిక్ అన్నది ట్విట్టర్ నుంచి అధికారిక ఖాతా అని ధ్రువీకరించడం. దీంతో ప్రముఖుల పేర్లతో చాలా మంది నకిలీ ఖాతాలు ప్రారంభించి, సబ్ స్క్రిప్షన్ చార్జీ చెల్లించినట్టు వెలుగుచూసింది. దీంతో వెంటనే ట్విట్టర్ దీన్ని నిలిపివేసింది.
అయితే, ఈ సదుపాయాన్ని ఎందుకు నిలిపివేసిందన్నది మస్క్ వెల్లడించలేదు. బోగస్ ఖాతాలను ఏరివేసిన తర్వాత తిరిగి బ్లూ టిక్ సేవను ట్విట్టర్ తిరిగి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. మనదేశంలో బ్లూ టిక్ చార్జీ రూ.719గా నిర్ణయించడం గమనించాలి.