వచ్చే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్టు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) ప్రకటించారు. ఈ మేరకు 2024 యూఎస్ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కు ఆయన మద్దతుదారులు పేపర్లు సమర్పించారు. ఫలితంగా వచ్చే ఎన్నికల అభ్యర్థిత్వం కోసం పత్రాలు సమర్పించిన మొదటి పోటీదారు అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా కేమ్ బ్యాక్’ మొదలైందని అన్నారు. ట్రంప్ గతంలో ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అధ్యక్ష ఎన్నికల కోసం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
2016 అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ట్రంప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. యూఎస్‌కు మరోమారు అధ్యక్షుడు కావాలని తలపోసినా గత ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు. దీంతో వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు. ఆయనకు ఇప్పటికీ ప్రజల్లో మంచి పాప్యులారిటీ ఉంది. వైట్‌హౌస్‌కు మళ్లీ రావాలన్న తన ఆకాంక్షను ట్రంప్ పలుమార్లు బహిరంగంగానే బయటపెట్టారు. దేశ చరిత్రలో ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా మారుతుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ తన ‘ట్రూత్’ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.