ఎన్నికల పోరులో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని, ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, గెలిచే అవకాశం లేకపోతే తనకు కూడా టికెట్ ఇవ్వొద్దని పేర్కొన్నారు. శనివారం అమరావతిలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోలాగానే మూడు జిల్లాలకు ఒక ఇన్చార్జ్ను నియమించాలని చంద్రబాబుకు సూచించారు. పార్టీ నేతలంతా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని కోరారు. పొత్తులపై పరోక్షంగా మాట్లాడుతూ రాముడి కథను అయ్యన్న ఉదహరించారు. రావణుడిని వధించే శక్తి రాముడికి ఉన్నా.. వానరులు, ఊడత, రావణుని తమ్ముడి సాయం తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేశారు.