2024 ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇచ్చిన నినాదానికి బీజేపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి సోము వీర్రాజు హాజరై మాట్లాడారు. నమామి గోదావరి ప్రాజెక్టుకు రాష్ట్రం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి కాలుష్యం నివారణకు కేంద్రం 86 కోట్ల రూపాయలు ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ 30 కోట్ల రూపాయలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.