వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘టీడీపీ కోసం కార్యకర్తలు తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నాతో సహా నేతలే సిద్ధంగా లేరు. నేతలు కూడా రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉండాలి. 160 స్థానాలకంటే ఎక్కువగానే టీడీపీ సీట్లు సాధిస్తుంది. శ్రీకాకుళంతో టీడీపీ హవా ప్రారంభమైంది... మహానాడుతో ఉధృతమైంది.. రాయలసీమలో ప్రభంజనమైంది. కర్నూలు జిల్లాలో చంద్రబాబు టూర్‌తో హిట్ అయ్యాయి. టీడీపీ గెలుపు ఖాయం.. కానీ గెలుపనే ధీమా వద్దు. చంద్రబాబు చివరి ఎన్నికలంటే కొందరు పిచ్చి కుక్కల్లా మాట్లాడారు. అవును చివరి ఎన్నికలే. దుర్మార్గ పాలన నుంచి విముక్తి కలిగించడానికి ఇవే చివరి ఎన్నికలు. చంద్రబాబు కష్టపడేది పదవుల కోసం కాదు.. రాష్ట్రాభివృద్ధి కోసం. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. మన మధ్య తగాదా పెడుతున్నారు. సీఎం జగన్‌ది పాచి నోరు. ఏపీ రాజధాని అమరావతేనని జగన్ అనలేదని నిరూపిస్తే ఉరేసుకుని చస్తాను. అమరావతిని రాజధానిగా అసెంబ్లీ సాక్షిగా జగన్ ఒప్పుకోలేదా..? మేం దాన్ని నిరూపిస్తాం.. జగన్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.