మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ చట్టాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని పీలేరు అర్బన సీఐ మోహనరెడ్డి సూచించారు. ‘దిశ చట్టం, మహిళా సాధికారత’ అనే అంశంపై పీలేరులోని శాఖా గ్రంథాలయంలో శనివారం ఉన్నత పాఠశాల విద్యార్థినులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆధునిక పోకడలు వెర్రితలలు వేస్తున్న ప్రస్తుత తరుణంలో మహిళలపై అఘాయిత్యా లు పెరిగిపోయాయని, విద్యార్థి దశలో చట్టాలపై అవగాహన పెంచుకుంటే వాటిని ఎదుర్కోవడం సులభమవుతుందన్నారు. అనంతరం గ్రంథాలయాధికారులు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన సభ్యుడు షామియాన షఫీ, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచఎం జయమ్మ గ్రంథాలయాధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు.