మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అస్వస్ధతకు గురై హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ శుక్రవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది. అయితే ఆయన చిన్నపాటి లేజర్ చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుంచి డిశార్జి అయ్యారు. ఈ నెల 12న జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నాని అదే రోజు రాత్రి హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం నొప్పి రావడంతో వైద్య పరీక్షల నిమిత్తం అపోలో ఆసుపత్రికి వెళ్ళారు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, లేజర్ చికిత్స ద్వారా వాటిని కరిగిస్తే సరిపోతుందన్న వైద్యుల సూచన మేరకు శుక్రవారం లేజర్ చికిత్స చేయించుకున్నారు. శనివారం సాయంత్రం ఆసుపత్రిలోనే తన ముఖ్య అనుచరుడైన పాలడుగు రాంప్రసాద్ జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం డిశ్చార్జ్ అయి హైదరాబాద్‌లోని తన స్వగృహానికి చేరుకున్నారు.