శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భూమి కావాలని కోరడమే ఆలస్యమన్నట్టు ప్రభుత్వం నామమాత్రపు ధరకే కట్టబెట్టింది. పీఠాన్ని విస్తరించాలనుకుంటున్నామని, వేద విద్యాలయం పెడతామని, అందుకు భీమిలిలో భూమి కేటాయించాలని ఇటీవల ప్రభుత్వ పెద్దలను కోరారు. మంత్రివర్గ సమావేశంలో అందుకు ఆమోదించి, భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాలు కేటాయించారు. తాజాగా దీనిపై జీవో కూడా జారీ చేశారు. కొత్తవలస సర్వే నంబరు 102/2లో 7.7 ఎకరాలు, 103లో 7.3 ఎకరాలు మొత్తం 15 ఎకరాలు శారదా పీఠానికి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అక్కడ మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా ఎకరా లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.15 లక్షలకు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ బహిరంగ మార్కెట్‌లో గజం ధర 25 వేలు పలుకుతోంది. ఆ లెక్కన ఎకరా రూ.10 కోట్లు పైమాటే. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ఎకరా 73 లక్షలు ఉంది. అయితే ప్రభుత్వం 15 లక్షలకే 15 ఎకరాలను శారదా పీఠానికి కేటాయించింది.