ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సీపీఎస్విధానాన్ని రద్దు చేయాల్సిందేనని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని రమణప్ప సత్రం పాఠశాలలో ఆదివారం రీజనల్ కన్వీనర్ మల్లేశు అధ్యక్షతన నిర్వహించిన ఎస్టీయూ ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు పింఛను ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అని సుప్రీంకోర్టు చెబుతున్నప్పటికీ పాలకులు పెడచెవిన పెట్టడం అన్యాయమన్నారు.
పింఛను అనేది భిక్షకాదు, ఉద్యోగుల హక్కు అనిఅన్నారు. సీపీఎన్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం తప్ప, జీపీఎస్ లాంటి ఇతర ఏ ప్రత్యామ్నాయాన్ని అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. 62 ఏళ్ల వయసులో పదవీవిరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి పింఛను లేకపోతే తన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కూలీ పని చేసుకుందామనుకున్నా ఆ వయసులో పని ఇచ్చేవారు కూడా దొరకరన్నారు. కుటుంబాలతో సహా నడిరోడ్డున పడాల్సిన దుస్థితి దాపురిస్తుందన్నారు. మన రాష్ట్రం కంటే తక్కువ బడ్జెట్ ఉన్న రాజస్థాన్, చత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి హామీ ఇవ్వని రాష్ట్రాలే సీపీఎస్లు రద్దు చేసి, ఓపీఎస్ ను అమలు చేస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నాన్చివేత ధోరణితో, కమిటీలతో కాలయాపన చేస్తూ, సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలా సీతారామన్ సీపీఎస్ విషయంలో మాట్లాడిన తీరు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఉపాధ్యక్షుడు దాదాపీర్, రాష్ట్ర నాయకులు మహేశ్వరరెడ్డి, నాగేంద్ర, సుధాకర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, మునిబాబు, శ్రీధర్ రావు, విజయవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.