బూతుల యూనివర్శిటీకి వైస్ ఛాన్సెలర్ జగన్ అయితే, రిజిస్ట్రార్ విజయసాయిరెడ్డి అని టీడీపీ నేత బొండా ఉమ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలను, గిట్టని మీడియాను నిలువరించడానికి ముఖ్యమంత్రి జగన్ బూతులనే నమ్ముకున్నారని ఆయన విమర్శించారు. తనకు, తన పార్టీకి బూతులే తెలియవన్నట్టుగా నరసాపురం సభలో జగన్ బ్రహ్మాండంగా నటించారని అన్నారు. చివరకు అసెంబ్లీని కూడా బూతుల అడ్డాగా మార్చిన ఘనత జగన్ దని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబును ఉరితీయాలి, కాల్చి చంపాలి, చెప్పుతో కొట్టాలి అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడిన జగన్ ఇప్పుడు గురివిందగింజలా నీతులు చెపుతున్నారని దుయ్యబట్టారు.
కొడాలి నాని, రోజా, విజయసాయిరెడ్డి, తమ్మినేని సీతారాం, మల్లాది విష్ణు, ధర్మాన కృష్ణదాస్, అనిల్ కుమార్ యాదవ్, పార్థసారథి, ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడే బూతులు జగన్ కు వినిపించడం లేదా? అని బొండా ఉమ ప్రశ్నించారు. నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్ బాగోతాలు జగన్ కు తెలియవా? అని అడిగారు. తాగి, గూండాలను వెనకేసుకుని, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ కు జగన్ మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. పచ్చి బూతులను విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా వదులుతుంటే జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. జగన్ రెడ్డి ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు.