తాజాగా సాల్మన్ ఐలాండ్స్ లో భారీ భూకంపం సంభవించింది.తీవ్ర భూకంపాలు, సునామీలకు పుట్టినిల్లుగా భావించే పసిఫిక్ మహాసముద్రంలో మరోసారి భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. నిన్న ఇండోనేషియాలో సంభవించిన భూకంపం ధాటికి 162 మంది వరకు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. నేడు సాల్మన్ ఐలాండ్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.
భారీస్థాయిలో ప్రకంపనలు రావడంతో సాల్మన్ దీవుల రాజధాని హోనియారాలో భవంతులు తీవ్రంగా ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాము భయంతో ఇళ్లను వీడి బయటకు పరిగెత్తినట్టు ప్రజలు వెల్లడించారు. దాదాపు 20 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగినట్టు తెలిపారు. భూకంపం ప్రభావంతో రాజధాని హోనియారా అంధకారంలో చిక్కుకుంది.
ఇదిలావుంటే భూకంపం నేపథ్యంలో సాల్మన్ ఐలాండ్స్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆ తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకుంది. అమెరికా భాగస్వామ్య సంస్థ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ దీనిపై స్పందిస్తూ పెను ముప్పు తప్పిందని, లేకపోతే భారీ సునామీ ముంచెత్తేదని వెల్లడించింది.