ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేష్ ఇటీవల బదిలీ చేసారు. జస్టిస్ దేవానంద్‌ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ రమేష్‌ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. అయితే వీరి బదిలీ వివక్షాపూరితమని భావిస్తున్న ఏపీ హైకోర్టు న్యాయవాదులు కొలీజియం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టులో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు న్యాయమూర్తుల బదిలీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదుల జేఏసీని ఏర్పాటు చేశారు. జేఏసీ కన్వీనర్లుగా శ్రావణ్ కుమార్, కోటేశ్వరరావు, ప్రభు, ప్రసాద్ బాబు, అశోక్ లను నియమించారు. రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని లాయర్ల జేఏసీ ప్రకటించింది. భోజన విరామ సమయంలో హైకోర్టులో నల్లజెండాలతో నిరసన తెలుపుతామని జేఏసీ నేతలు ప్రకటించారు.