తనకు చెందిన పలు వ్యాపార సంస్థలను మూసివేస్తూ వస్తున్న దిగ్గజ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ భారత్ లో మరో వ్యాపారాన్ని మూసేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఎడ్ టెక్, ఫుడ్ డెలివరీ వ్యాపారాలను మూసివేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించగా.. తాజాగా హోల్ సేల్ ఈ కామర్స్, డిస్ట్రిబ్యూటషన్ వ్యాపారాలను సైతం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, హుబ్లి ప్రాంతాల్లోనే ఈ సేవలు అందిస్తోంది. ఈ వ్యాపారం మూసివేత ఒక విధంగా స్థానిక వ్యాపారులకు అనుకూలమనే భావించాలి.
వేగంగా వినియోగమయ్యే ఉత్పత్తులను కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసి, వాటిని స్థానిక కిరాణా షాపులు, ఫార్మసీలు, డిపార్ట్ మెంటల్ స్టోర్లకు అమెజాన్ సరఫరా చేస్తుంటుంది. అమెరికా ఆర్థిక మాంద్యం ముంగిట్లో ఉంది. దీనికితోడు భారత మార్కెట్లో అమెజాన్ ఇప్పటి వరకు రూపాయి లాభం కళ్ల చూడలేదు. పైగా ఏటేటా భారీ నష్టాలు పోగేసుకుంటోంది. ఈ తరుణంలో వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నష్టాలు, వ్యయాలను పరిమితం చేసుకునేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.