మన సంస్కృతి, కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన కళలను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నాలుగు జోన్‌లలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, గుంటూరులో ఇప్పటికే ఉత్సవాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గడచిన 1000 సంవత్సరాలుగా గోదావరి జిల్లాలో కళలు, సంస్కృతి విరాజల్లుతున్నాయని అన్నారు. భాష, వేషం, నటనకు సంబంధించి గోదావరి జిల్లాల కళాకారులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మంత్రి రోజా చెప్పారు. కళామతల్లి ముద్దుబిడ్డలు గోదావరి జిల్లాల కళాకారులే అని అభిప్రాయపడ్డారు. కళాకారులను దూషించే వారు జీవితంలో బాగుపడరని హెచ్చరించారు.