ఇటీవల ఉపాధ్యాయులకు ఫేస్ అటెండెన్స్(ముఖ ఆధారిత హాజరు) విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులకూ అమలు చేస్తోంది. గురువారం నుంచి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ఫేస్ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా డిగ్రీ కళాశాలలన్నీ వెంటనే దీన్ని అమలుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇంజనీరింగ్, ఫార్మా, బీఈడీ వంటి ఇతర ఉన్నత విద్య కోర్సులన్నిటికీ దశలవారీగా అమలుచేయనున్నారు. దీనికిగాను గత రెండు వారాలుగా డిగ్రీ కళాశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఫేస్ అటెండెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపారు. డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులతో పాటు విద్యార్థుల రిజిస్ర్టేషన్‌ను పూర్తిచేశారు. ఇటీవల కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు మినహా దాదాపు అందరినీ ఇందులోకి తీసుకొచ్చారు.