మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధికారులు గురువారం కీలక ప్రకటన చేశారు. శుక్ర, శని, ఆది వారాల్లో వరుసగా మూడు రోజుల పాటు దేశ రాజధానిలో మద్యం అమ్మకాలు నిషేధించనున్నట్లు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఎంసీడీ పరిధిలోని 250 వార్డులకు డిసెంబర్ 4న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు డిసెంబర్ 7న డ్రై డేగా పాటిస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. షాపులు, క్లబ్బులు, బార్లు మొదలైనవాటిలో ఆ రోజుల్లో మద్యం విక్రయాలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.