ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను, విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి కోరారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రతిభలో దివ్యాంగులు సైతం సకలాంగులకు తీసిపోరని అన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, కష్టపడి చదవడం ద్వారా వృద్దిలోకి రావాలని కోరారు. ప్రతీ తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలని అనుకుంటుందని, అయితే అవగాహనా లోపం, ఇతరత్రా కారణాలవల్ల ఒక్కోసారి వివిధ రకాలలోపాలతో శిశువులు జన్మించడం జరుగుతుందని చెప్పారు.
ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత, పోషకాహారాన్ని తీసుకోకపోవడం, అయోడిన్, బి 12 లోపాలు, మేనరిక వివాహాలు తదితర కారణాలవల్ల దివ్యాంగులుగా శిశువులు జన్మిస్తున్నారని అన్నారు. వీటి నివారణాకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుఓందని, పోషకాహారాన్ని పంపిణీ చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా రేషన్ డిపోలద్వారా పంపిణీ చేస్తున్న పోర్టిఫైడ్ బియ్యాన్ని ఆహారంగా స్వీకరించడం ద్వారా చాలావరకు రక్తహీనతను నివారించుకోవచ్చని సూచించారు. ఒక్కోసారి మానవ తప్పిదాలు, త్రాగి వాహనాలను నడపడం, హెల్మెట్ లేకుండా వాహనలను నడపడం లాంటి కారణాలవల్ల కూడా ప్రమాదాలకు గురై, వికలాంగులుగా మారుతున్నారని అన్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం, నిర్లక్ష్యన్ని విడనాడటం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.