రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యెక ఓటర్ల నమోదు కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఈ నెల 3, 4 తేదీలలో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకోసం విద్యార్ధులకు అవగాహన కలిగించి ఓటర్లుగా నమోదు చేయడానికి ప్రతి కళాశాలకు ఒక నోడల్ అధికారి చొప్పున 61 మందిని జిల్లా కలెక్టర్ నియమించారు. జనవరి 1, 2023 నాటికీ 18 సంవత్సరములు నిండిన వారందరినీ ఓటర్లుగా చేర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి కళాశాల లో ఫారం-6 లను సరఫరా చేయడం జరిగిందని, డిసెంబర్ 8 వరకు ఓటర్ గా చేరుటకు అవకాశం కలదని, ఏ ఒక్క కళాశాలలో కూడా 18 ఏళ్ళు నిండిన వారు ఓటరు గా నమోదు కాకుండా ఉండకూడదని ఆదేశించారు. తహసిల్దార్లు, బి. ఎల్. ఓ లు నోడల్ అధికారులకు సహకరించాలని, ప్రతి తరగతి కి వెళ్లి వోటర్లు గా చేర్పించాలని కలెక్టర్ తెలిపారు. నోడల్ అధికారులు ప్రతి రోజు ఏ ఏ కళాశాలలను సందర్శించారు, ఎంత మందికి ఫారం – 6 ఇచ్చారు, ఎంతమందిని ఓటర్లుగా చేర్పించారనే సమాచారాన్ని సాయంత్రానికి అందజేయాలని సూచించారు.