ఎమ్మెల్సీ ఓటు నమోదుకు, జాబితాల సవరణకు సంబంధించిన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఓటు కల్పించాలని సూచించారు. నెల్లిమర్ల పర్యటనలో భాగంగా శనివారం ఆమె స్థానిక నాలుగో నెంబరు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రధానంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలపై స్థానిక తహశీల్దార్, వీఆర్వో, బీఎల్‌వోలను ఆరా తీశారు. ఎంతమంది అర్హులకు ఓటు హక్కు కల్పించారు. ఎన్ని డూప్లికేట్ల ఓట్లను తొలగించారు అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ ఓటు నమోదు, జాబితాల సవరణలో అనుసరించాల్సిన పద్ధతులపై రెవెన్యూ సిబ్బందికి ఈ సందర్బంగా కలెక్టర్ సూచనలు చేశారు. ఆధార్ - ఓటు అనుసంధాన ప్రక్రియ నెల్లిమర్ల పరిధిలో 61 శాతం అయ్యిందని తహశీల్దార్ చెప్పగా మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఆదేశించారు.