పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తాజాాగా భారతదేశాన్ని ఉద్దేశించి తన నోటీ దురుసును ప్రదర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భారత్ కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ పేర్కొన్నారు. ఇటీవలే ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మునీర్ శనివారం పీవోకేలో పర్యటించారు. ఈ సందర్భంగా లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ వోసీ) దగ్గర పరిస్థితులను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాక్ భూభాగంలో ఒక్క ఇంచు జాగాను కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు.
మాతృభూమిని కాపాడుకోవడానికి పాక్ సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని వివరించారు. శత్రువుకు ధీటుగా జవాబు చెబుతారని మునీర్ పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యవహారంపై భారత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల మీడియాతో మాట్లాడారు. పీవోకే ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిస్తే వెంటనే అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ స్పందించారు. తమ దేశ భూభాగాన్ని కాపాడుకోవడం పాక్ సైనికులకు తెలుసని చెప్పారు. పీవోకే విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాక్ ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.