రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలని, కేవలం పాలనా రంగంలోనే కాక జల వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల కోసం అడుగు ముందుకు వేయాలనే సంకల్పంతో నేడు(సోమవారం) చేపట్టిన రాయలసీమ గర్జనకు పలు సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైయస్ఆర్‌సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు.