రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకే ఉందని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. కర్నూలు గర్జనలో బైరెడ్డి మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు భూములిచ్చిన అమరావతివారిది త్యాగమయితే...శ్రీశైలం ప్రాజెక్టు కోసం 55 వేల ఎకరాల భూములిచ్చిన మాది త్యాగం కాదా ? అని ప్రశ్నించారు. మా ప్రాంత అభివృద్ధి కోసం..మా ప్రాంతానికి గుర్తింపు కోసం రాజధానిని కోరుతున్నామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారని, అందరం సీఎం వైయస్ జగన్‌కు మద్దతుగా ఉందామని, కర్నూలుకు న్యాయ రాజధానిని సాధించుకుందామని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు.