వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతల అక్రమాలను వెలికి తీస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల అండతో భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావెల్, మట్టి, మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేశారనే కక్షతో చింతమనేని ప్రభాకర్ ముఖ్య అనుచరుడు శివబాబుపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఇది వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పనేనని పేర్కొన్నారు. దాడి చేసిన వైసీపీ వాళ్లని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారం అండతో ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రజావ్యతిరేకత వెల్లువలో వైసీపీ సర్కారు కొట్టుకుపోవడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. లండన్ మందులు వాడే అబ్బాయ్, లండన్ నుంచి వచ్చిన అబ్బయ్యని అక్కడికే పంపడం ఖాయమని... లగేజీ సర్దుకోవాలని దెందులూరు వైసీపీ ఎమ్మెల్యేకి నారా లోకేష్ సూచించారు.