నువ్వా నేనా అన్నట్లు సాగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. నేడు రెండో దశ ఎన్నికలు నిర్వహించారు. ఈ సాయంత్రం 5.30 గంటల సమయానికి 59 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో భాగంగా 14 జిల్లాల వ్యాప్తంగా 93 నియోజకవర్గాల్లో పోలింగ్ చేపట్టారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబరు 1న జరిగిన తొలి దశ పోలింగ్ లో 89 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. ఈ రెండు దశలకు కలిపి డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇదిలావుంటే రెండో దశ పోలింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు, పలువురు ప్రముఖుల భవితవ్యం ఈ రెండో దశ పోలింగ్ నిర్ణయించనుంది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ (ఘట్లోడియా), పాటిదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ (విరామ్ గమ్), ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ (గాంధీ నగర్ సౌత్), జిగ్నేశ్ మేవానీ (వడ్గామ్) తదితరుల నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఇప్పుడు అందరి చూపులు ఎగ్జిట్ పోల్స్ పై పడ్డాయి.