రాష్ట్రాభివృద్ధి జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మండలంలోని మొగలిపురంలో మంగళవారం గ్రామ దేవత బండమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... మూడున్నరేళ్ల జగన్మోహన్రెడ్డి పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. టీడీపీ హయాంలో 145 సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలిచినట్టు చెప్పారు. అధికార వైసీపీకి చెందిన సర్పంచులే ధర్నాలు చేస్తున్నారంటే.. రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రగల్భాలు పలకడమే తప్ప, సీఎం జగన్ ముందు మాట్లాడే పరిస్థితి లేదన్నారు.