దక్షిణ అండమాన్‌లో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలై తూర్పు ఆగ్నేయంగా 770 కిలోమీటర్లు.. చెన్నైకు 1020 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇది బుధవారం ఉదయం తీవ్రవాయుగుండగా.. సాయంత్రానికి తుఫానుగా మారుతుంది. ఈ క్రమంలో పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఈ నెల ఎనిమిదో తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో తీరం దిశగా రానున్నది. తరువాత కూడా పశ్చిమ వాయువ్యంగానే పయనిస్తూ ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి లేదా పదో తేదీ తెల్లవారుజామున ఉత్తర తమిళనాడులో చెన్నైకు దక్షిణాన తీరం దాటుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. కాగా, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.