ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తపస్వి కుంటు సభ్యులకు చంద్రబాబు ఫోన్లో ఓదార్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 09:40 PM

ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వైద్య విద్యార్ధిని తపస్వి కుంటు సభ్యులను టీీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. ఇదిలావుంటే తపస్వి అంతిమయాత్రలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్యతో పాటు మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ, పామర్రు టీడీపీ ఇన్ ఛార్జ్ వర్ల కుమార్ రాజా, తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తపస్విని తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. 


తపస్వి అంతిమయాత్ర సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. ప్రేమ పేరుతో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టుగా టెక్నాలజీని ఉపయోగించి యువతుల్ని మభ్యపరిచి, వారిని ట్రాప్ చేసి, వారి బంగారు జీవితాలను నాశనం చేస్తున్న ప్రేమోన్మాదుల అఘాయిత్యాలకు ఈ  ప్రభుత్వంలో అంతులేకుండా పోయిందని ఆరోపించారు. 


"మొన్నటి రమ్య ఉదంతం నుంచి నిన్నటి తపస్వి హత్య వరకు ఇదే పరిస్థితి. ప్రేమ పేరుతో యువతుల్ని ట్రాప్ చేసి, తరువాత ఒప్పుకోలేదని నిర్దాక్ష్యణ్యంగా వారి ప్రాణాలు బలిగొంటున్నారు. మనరాష్ట్రంలో శాంతిభధ్రతలు క్షీణించి, అరాచకశక్తుల్ని అదుపుచేయలేని దుస్థితిలో రాష్ట్ర పోలీస్ శాఖ ఉంది. నిర్వీర్యమైన హోంశాఖ, అధికారంచేపట్టి మూడున్నరేళ్లయినా శాంతిభద్రతల్ని సమీక్షించలేని బలహీన ముఖ్యమంత్రిని చూశాక, ఇక మనరాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని గగ్గోలు పెట్టడం అర్థవంతమే. 


నిన్నటి తపస్వి కేసులో దుండగుడు ప్రేమ పేరుతో సదరు యువతి వెంటపడి వేధిస్తుంటే, బాధితులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆనాడే ఈ ప్రేమోన్మాదిపై పోలీసులు కఠినచర్యలు తీసుకొని ఉంటే, ఈ ఘటన జరిగేదికాదు, తపస్వి బలయ్యేదికాదు" అని స్పష్టం చేశారు. 


"పోలీసులు తమ ప్రధాన విద్యుక్తధర్మం మరిచి, ముఖ్యమంత్రికి పరదాలు కట్టడంలో, ఆయన సభలకు బారికేడ్లు ఏర్పాటు చేయడంలో, ప్రత్యర్థుల్ని వేధించడంలో, ప్రశ్నించే గొంతుకలను నొక్కడంలో నిమగ్నమై శాంతిభద్రతల్ని గాలికి వదిలేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి శాంతిభద్రతలు సమీక్షించి, మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి" అంటూ డిమాండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com