యావత్తు ప్రపంచం నేడు నూతన ఆవిష్కరణల దిశగా అడుగులేస్తోంది. ఇదిలావుంటే కార్బన్ డై ఆక్సైడ్ హానికరం. గాలిలో ఇది ఎక్కువైతే అనారోగ్యానికి దారితీస్తుంది. చెట్లు అధికంగా ఉన్న చోటు అవి కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించుకుంటాయి. కానీ, పట్టణాల్లో గజం స్థలం కూడా రూ.లక్షలు పలుకుతున్న వేళ, చెట్లను పెంచేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మరి గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను ఎలా తీసేయాలి? ఇందుకు ఓఎన్ జీసీకి ఓ ఐడియా తట్టింది.
గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను మెషిన్ల సాయంతో గ్రహించిన పైపులైన్ ద్వారా సముద్ర గర్భంలోని స్టోరేజీ కేంద్రానికి తరలిస్తే బావుంటుందని యోచించింది. ఇందుకోసం నార్వేకు చెందిన ఈక్వినార్ అనే కంపెనీ భాగస్వామ్యంతో ‘మెగా కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ (సీసీఎస్) ప్రాజెక్ట్‘ చేపట్టాలని అనుకుంటోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే ఏటా 1.5 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను గాలి నుంచి గ్రహించగలదు.
కార్బన్ డై ఆక్సైడ్ ను అధికంగా విడుదల చేసే పరిశ్రమల దగ్గర ఈ కార్బన్ క్యాప్చర్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గుజరాత్ తీరంలో సముద్రగర్భంలో కార్బన్ డై ఆక్సైడ్ స్టోరేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. దీన్ని నీతి ఆయోగ్ కు ఓఎన్ జీసీ సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. స్టీల్, ఆయిల్, సిమెంట్, విద్యుత్ కేంద్రాల వద్ద కార్బన్ క్యాప్చర్ ను ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. అనుమతి వస్తే ఏర్పాటుకు మూడేళ్లు పడుతుందని అంచనా.
అయితే, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెద్ద అడ్డంకి కావచ్చని తెలుస్తోంది. కేవలం 0.5 మిలియన్ టన్నుల కార్బన్ క్యాప్చర్ ప్రాజెక్టు ఏర్పాటుకే బిలియన్ డాలర్లకు పైగా (రూ.8,200 కోట్లు) ఖర్చు అవుతుందని లోగడ వేసిన అంచనాలో తెలిపింది. మరి 1.5 మిలియన్ టన్నుల ప్రాజెక్టుకు ఎంత లేదన్నా రూ.24 వేల కోట్లకు పైనే వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఏమంత గిట్టుబాటు కాకపోవచ్చు. కాకపోతే ప్రభుత్వం నుంచి నిధుల మద్దతు ఉంటే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంటుంది.