వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో శుక్రవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురైన వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థల్లో రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేయడమే వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దినట్లు అవుతుందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 75వ సంవత్సరం ఇది. ఈ 75 ఏళ్ళలో దేశం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కానీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి విషయంలో మాత్రం స్వతంత్ర భారతావని విఫలమైందన్న విషయం కఠోర వాస్తవం అని విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని రంగాలలో తమకు సమాన అవకాశాలు ఉండాలన్న వెనుకబడిన తరగతుల ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష మాత్రం ఈనాటికీ నెరవేరలేదని అన్నారు.