భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రచారం చేసేందుకు జీ-20 వేదికను వినియోగిస్తామని సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన సంస్కృతి పరిరక్షణకు, చోరీకి గురై దేశం నుంచి తరలిపోయిన ప్రాచీన కళాఖండాలను తిరిగి వెనక్కి రప్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? అలాగే జీ-20 వేదికగా భారత సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా..? అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సవివరంగా సమాధానాలు చెప్పారు.