కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఇతరత్రా రూపాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన రూ.982 కోట్లను వెనక్కి తీసుకుందంటూ ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అబద్ధాల అల్లిక. తప్పుల తడక. జీతాలు, పింఛన్లు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ ఆ దినపత్రిక తన వ్యక్తిగత ఆరోపణలనే ఆధారాలుగా రాసిన వార్త కథనం ముమ్మాటికి అబద్ధం అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల పొడవునా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం మరచిపోయారా? అని ప్రశ్నించారు. తేదీ మొదలైన రోజు నుంచి నెలాఖరు దాకా జీతాలివ్వడం లాంటివి ఆనాడు కనపడలేదు కదా? అని నిలదీశారు. అప్పుడేవేవో అద్భుతాలు జరిగాయి..ఇప్పుడు ఏమీ జరగట్లేదనేలా రాసే మీ రాతలు.. నీటిమూటలు కావా? అని ప్రశ్నించారు. ఆ పత్రిక దుష్ప్రచారం చేస్తుంది అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.