వైయస్ఆర్ సీపీ జయహో బీసీ మహాసభ సక్సెస్తో ప్రతిపక్షనేత చంద్రబాబుకు బీపీ పెరిగిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ధీరుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని గుర్తుచేశారు. దేశ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ప్రభంజనం చూశామని, విజయవాడ కేంద్రంగా ‘జయహో బీసీ మహాసభ’ సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు. సభను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మూడున్నరేళ్ల వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు ఉవ్వెత్తున కదలివచ్చారు కనుకే కనీవినీ ఎరుగని రీతిగా సభ విజయవంతమైందని మంత్రి జోగి రమేష్ అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.