ప్రస్తుతానికి తాను సీఎం అప్పగించిన బాధ్యతలతోనే బిజీగా ఉన్నానని, అయితే రాబోయే రోజుల్లో తనకు కొండపి సీటు ఇస్తే పోటీ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడు, వైసీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు అన్నారు. కొండపిలో ఓ శుభకార్యానికి హాజరయిన ఆయన గురువారం రాత్రి స్థానిక మండల పరిషత్ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. నియోజకవర్గానికి, ప్రధానంగా ఎస్సీలకు కొండపి ఎమ్మెల్యే చేసిన మేలేమిటో ఒక్కటి చూపించాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కొండపి సీటు ఎవరికిచ్చినా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు, పారిశ్రామిక వేత్త చింతల వెంకటేశ్వర్లు, బొడ్డపాటి అరుణ, బొక్కిసం ఉపేంద్ర చౌదరి, పలు గ్రా మాల నాయకులు పాల్గొన్నారు.