పెన్షనర్లకు అన్యాయం చేయాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో జగనకు గుణపాఠం చెబుతామని పెన్షనర్ల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్ హెచ్చరించారు. పదో తేదీ వచ్చినా పెన్షన అందడం లేదంటూ కలెక్టరేట్‌లోని ట్రెజరీ, బుడ్డప్పనగర్‌లోని సబ్ ట్రెజరీ కార్యాలయాల వద్ద పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పెద్దనగౌడ్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు వేధించని విధంగా వైసీపీ ప్రభుత్వం పెన్షనర్లను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కొత్త పథకాలేమీ తేకపోగా ఉన్న పథకాలు ఊడగొట్టి కోతల ప్రభుత్వంగా నిలిచిందని మండిపడ్డారు. పెన్షన కోసం ప్రతి నెలా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితిని పెన్షనర్లు ఎదుర్కొంటున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే... పెన్షనర్ల ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర నాయకులు స్పందించే పరిస్థితిలో లేకపోవడంతోనే... మా గోడును చెప్పుకునేందుకు నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు.