ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా రంజక పాలన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని నాగవంసపు వీధి జంక్షన్లో జరిగిన 20, 21, 50వ డివిజన్లకు సంబంధించి జరిగిన జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి పాలన సాగిస్తున్నారని అన్నారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. అదే పరిస్థితులలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కానరాలేదని అన్నారు. ఎన్నికల సమయంలో నవరత్నాల మేనిఫెస్టో తయారుచేసి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి, ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారన్నారు.
వాలంటరీ వ్యవస్థ, సచివాల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకే తీసుకువచ్చారని అన్నారు.
2019 వ సంవత్సరంలో ఎన్నికల సమయంలో విజయనగరం నియోజకవర్గంలో జోనల్ వ్యవస్థను తీసుకువచ్చారని, ప్రస్తుతం అదే జోనల్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని తెలిపారు. తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో గెలిచిన, ఓడిన ప్రజలతో మమేకమై పని చేస్తున్నానని అన్నారు. తన వెనుక ఉన్నది కార్యకర్తలేనని, పార్టీకి కార్యకర్తలు వెన్నెముక లాంటి వారని అన్నారు. తన రాజకీయ జీవితంలో అవినీతి, లంచగొండితనం లేకుండా ప్రజలతో మమేకమై పని చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.