కాంగ్రెస్ పార్టీలో తాజాగా ప్రియాంకా గాంధీ హవా మొదలైందని చెప్పవచ్చు. అందుకు కారణాలు లేకపోలేదు. ఇదిలావుంటే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికార బీజేపీని ఓడించిన కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రచారం మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరిగి అధికారం కట్టబెట్టిన క్రెడిట్ ఆమెకే దక్కింది.
ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించారు. కొత్త జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు, అనేక ర్యాలీలలో పాల్గొనడమే కాకుండా, ఎన్నికల కోసం వ్యూహాల ప్రణాళికలు రచించడంలో కూడా పాలు పంచుకున్నారు. ప్రచార బాధ్యతలు నిర్వహించిన ప్రియాంక గాంధీకి ఇది తొలి ఎన్నికల విజయం. దాంతో, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రియాంక గాంధీనే ఖరారు చేస్తారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ సీనియర్ నేతలంతా పోటీ పడుతుండగా.. ప్రియాంక ఎవరి పేరు ప్రతిపాదిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 40 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం సిమ్లాలో సమావేశయ్యారు. సీఎంను ఖరారు చేసే బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి కేంద్ర పర్యవేక్షకులు రాజీవ్ శుక్లా, భూపిందర్ హుడా, భూపేష్ బఘేల్ కూడా హాజరయ్యారు. వీరు ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి ఎవరికి ఎక్కువ మద్దతు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
మరోవైపు సీఎం పదవి ఆశిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ తన మద్దతుదారులతో బల ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు, మాజీ విపక్ష నేత ముకేశ్ అగ్నిహోత్రి, మాజీ పీసీసీ చీఫ్ కుల్‌దీప్ సింగ్ రాథోడ్, ఠాకూర్ కౌల్‌సింగ్, ఆశాకుమారి, హర్షవర్ధన్ చౌహాన్ కూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. దాంతో, ప్రియాంక గాంధీ ఎవరికి అధికారం కట్టబెడతారన్నది ఆసక్తి కలిగిస్తోంది.