మాండౌస్ తుపాను కారణంగా రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాభావంతో పంటలు నీటమునిగి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా శాపంగా మారిందన్నారు. తక్షణమే అధికారులను క్షేత్రస్థాయికి పంపి పంట నష్టాన్ని అంచనా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు. వర్షంతో తడిసిన పంటలను ప్రభుత్వం సబ్సిడీ ధరకు కొనుగోలు చేయాలన్నారు. వరదల కారణంగా పంటలు కొట్టుకుపోయిన రైతులకు పరిహారం అందించాలని అచ్చెన్నాయుడు కోరారు.