పెళ్లి సంబంధాలు చూడటమే ఓ వ్యక్తి చావుకు కారణమైంది. కారణాలేమో గానీ తనకు పెళ్లి సంబంధాలు వద్దంటూ చెప్పిన ఆ వ్యక్తి చివరకు ఆత్మహత్య చేసుకొన్నాడు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన సచివాలయ ఉద్యోగి గొర్లె వరుణ్‌కుమార్ (31) ఆత్మహత్య చేసుకున్నాడు. తాను వద్దని వారించినా కుటుంబ సభ్యులు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరుణ్‌కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. దేవరాపల్లికి చెందిన గొర్లె వరుణ్‌కుమార్ (31) అదే మండలంలోని వేచలం గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మేన్‌గా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
తన కుమారుడికి వివాహం చేయాలన్న ఆలోచనతో తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు కరువునాయుడు, బంధువులు వరుణ్‌కుమార్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే పెళ్లి సంబంధాలు చూడొద్దని కుటుంబ సభ్యులను వరుణ్‌కుమార్ నిరాకరించాడు. అయినా కుటుంబ సభ్యులు తనకు సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం స్నానం చేసి వస్తానని చెప్పి ఇంట్లో రెండో అంతస్తు గదిలోకి వెళ్లి తలుపుకు గడియ పెట్టుకున్నాడు.
అయితే, వరుణ్ కుమార్ ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే వరుణ్ ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో గది తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి శ్లాబ్ హుక్కుకి తాడుతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కిందికి దించి, ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, అప్పటికే వరుణ్‌కుమార్ మృతి చెందాడని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
వరుణ్ తల్లి పైడితల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ తాతారావు, ఎ.కోడూరు ఎస్‌ఐ లోకేశ్వరరావు మృతుడి ఇంటికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, సచివాలయ ఉద్యోగి వరుణ్ కుమార్ మృతి చెందాడన్న విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లికి చేరుకొని మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడి తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు నాయుడు తదితర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.