విద్యుత్‌షార్ట్‌తో ఇల్లు దగ్ధమవటంతో పాటు విలువైన వస్తువులు కాలిపోయి రూ. 3లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ప్రకాశం జిల్లా, కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండు సమీపంలోని 10వ వార్డులో నివాసం ఉంటున్న ఖాజాబి డిపో వద్ద పరోటా బండి నిర్వహిస్తుంటుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి స్లాబ్ ఉరుస్తుంది. శనివారం అర్ధరాత్రి ఖాజాబి కుమారుడు ఒకడే ఇంట్లో నిద్రిస్తున్నాడు. విద్యుత్ మీటరు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి గదిలోకి మంటలు వ్యాపించాయి. లోపలున్న అతను లేచి కేకలు పెట్టుకుంటూ బయటకు పరుగులు పెట్టాడు. ఇంట్లోని ఫ్రిజ్, డబుల్‌కాట్ బెడ్, కూలర్, విలువైన సామాగ్రితోపాటు అలమరలో పెట్టిన రూ.60వేల నగదు కాలిపోయాయి. సమీప ప్రజలు విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరాను నిలిపి వేయటంతో ప్రజలు మంటలు ఆర్పివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. పరోటా వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన ఖాజాబీకి ఇల్లు కాలిపోవటం చూసి కన్నీరుమున్నీరైంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.